శ్రీకాకుళం: స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్పందన, అవినీతిరహిత పాలన, విత్తనాల పంపిణి, వ్యాధులపై అప్రమత్తం, ఇళ్లస్థలాల పంపిణీ తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై తక్షణమే స్పందించాలని చెప్పారు. ఇందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ప్రత్యేక చొరవ చూపకపోతే స్పందన క్లిక్ కాదని, ప్రజలను సంతోష పెట్టాలంటే మరింత ఫోకస్ చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. స్పందనలో వచ్చిన అర్జీలపై వారం రోజుల్లో పరిష్కారం కావాలని, ఇందుకు ప్రత్యేక మెకానిజాన్ని అనుసరించాల్సి ఉందని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో పరిష్కార నాణ్యత పరిశీలనా మెకానిజాన్ని ఏర్పాటుచేయాలని చెప్పారు. మండల స్థాయిలో జరుగుతున్న ఫిర్యాదుల విభాగం జిల్లా కలెక్టర్ కార్యాలయంతో ఆన్ లైన్ లో అనుసంధానం చేయాలని, తద్వారా మండలంలో తహసిల్దార్ కు అనుమానాలు ఉంటే వాటిని జిల్లా కలెక్టర్ తక్షణమే పరిష్కారం చూపే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. దీనివలన పరిష్కారం మరింత సమర్థవంతంగా జరుగుతుందని ఆశించారు. అవినీతిరహిత పాలనను అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అవినీతి అనేది ఏ స్థాయిలోను ఉండరాదని, దీనిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్లకు వివరించారు.











0 Comments:
Post a Comment